Tuesday 19 June 2012

ఆమె ఆదాయం రోజుకు 2 లక్షలు!

కొన్ని జీవితాల గురించి తెలుసుకుంటూ ఉంటే మనకు కష్టాలెందుకు రాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే జీవితం సౌకర్యవంతంగా ఉన్నంత కాలం ఏదైనా చేయాలన్న తపన మనలో జ్వలించదు. బంతి ఎంత బలంగా నేలకు కొడితే అంత వేగంగా పైకి వస్తుంది. మనిషికి ఎంత తీవ్రమైన కష్టాలు వస్తే అంత రాటుదేలుతాడు. దానికి అద్భుతమైన ఉదాహరణ ప్యాట్రీషియా నారాయణ్. 

 ప్రేమకు రెండు పార్శ్వాలుంటాయి. అది కొందరిని వరిస్తుంది. ఇంకొందరిని కబళిస్తుంది! తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్యాట్రీషియా నారాయణ్‌కు ప్రేమ తన రెండో పార్శ్వాన్ని చూపింది. ప్రభుత్వోద్యోగాలు చేసే తల్లిదండ్రుల గారాబమైన పెంపకానికి ప్రతిరూపం ప్యాట్రీషియా. చాలామంది యువతుల్లానే ఆమె ప్రేమలో పడింది.

కానీ, అతను ఇతర మతస్థుడు. అది చాలు... పెద్దలు తిరస్కరించడానికి! వారిని ఎదిరించి ఒక్కటయ్యారు. భర్త దుర్మార్గాలు తెలియడానికి ఆమె ఎంతోకాలం పట్టలేదు. డ్రగ్స్‌కు, దురలవాట్లకు బానిసైన భర్త పెట్టే చిత్రహింసలకు ఆమె శరీరం మొద్దుబారింది. జీవితం మసకబారింది. ఎంతకాలమని భరించగలదు..? అందుకే ఓపిక నశించాక ఇద్దరు పిల్లలతో ఇంటినుంచి బయటికొచ్చేసింది. బాధ బయటకు పోయేంత వరకు ఏడ్చిఏడ్చి, పిల్లల బాధ్యత చూడాలి కాబట్టి బతుకుబాట పట్టింది.

మెరీనా బీచ్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. తండ్రితో మాటల్లేవు. అమ్మ మనసు వెన్న కాబట్టి విషయం చెప్పి కొంత సొమ్ము తెచ్చుకుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం... కొన్ని వంటలు చేసి మెరీనా బీచ్‌లో తిరుగుతూ అమ్మింది. మొదటి రోజే తాను వండిన వంటలన్నీ అమ్మేసింది. కొంతకాలం గడిచాక.. మెరీనా బీచ్‌కు వేలాది మంది రావడం చూసి ఇలా తిరిగి అమ్ముకోవడం కంటే ఒక స్టాల్ పెట్టుకోవడం మంచిదనుకుంది. అనుమతుల కోసం ప్రయత్నించింది.


లెక్కలేనన్నిసార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగితే ఏడాది తర్వాత ఆమెకు అనుమతి లభించింది. ‘ఇక రేపటి నుంచి నేను వ్యాపారి’ని... ఇదీ ఆమె ఆనందం. కానీ, ఎంత విచిత్రమైన అనుభవమంటే మొదటి రోజు ఆమె ఆదాయం అక్షరాలా అర్ధ రూపాయి! కళ్ల నిండా నీళ్లు! దేవుడా అనుకుంది. అమ్మకు చెప్పి ఏడ్చింది. ‘నీవు కచ్చితంగా గెలుస్తావు’ అంటూ అమ్మ ఓదార్చింది.

అదే నిజమైంది. మరుసటి రోజు వ్యాపారం బాగానే జరిగింది. రూ.700 చేతికందాయి. కొత్త వెరైటీలతో బీచ్‌లో ఎవ్వరూ అమ్మని రకరకాల వంటలను రుచికరంగా అందుబాటులోకి తెచ్చింది. దీంతో బీచ్‌లో ఆమె దుకాణం రుచులకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. రోజుకు రూ.25 వేలు వ్యాపారం జరిగే స్థాయికి వెళ్లింది ఆమె బిజినెస్. ప్రతిరోజూ ఉదయం 5-9 వరకు, సాయంత్రం 4-11 వరకు ఆమె వ్యాపారం నడిపేది.

జీవితంలో కొత్త మలుపు

మెరీనా బీచ్‌కు ఎందరో మార్నింగ్ వాక్‌కు వస్తుంటారు. వారిలో స్లమ్ క్లియరెన్స్ బోర్డు చైర్మన్ ఒకరు. ఓ రోజు ఆమె వద్దకు వచ్చి ‘మా ఆఫీసులో క్యాంటీన్ బాధ్యతలు ఇస్తే నడపగలరా?’ అంటూ అడిగారు. సంతోషంగా ఒప్పుకుంది. అలా ఆమె వ్యాపార స్థాయి పెరిగింది. ఆ తర్వాత ‘బ్యాంక్ ఆఫ్ మధురై’లో క్యాంటీన్ పెట్టమని కోరడంతో ఆ అవకాశాన్నీ అందిపుచ్చుకుంది. ఎక్కడికెళ్లినా విశేషమైన ఆదరణ, ఆదాయం.

అనంతరం ‘నేషనల్ పోర్ట్ మేనేజ్‌మెంట్’లో మరింత పెద్ద క్యాంటీన్ నడిపే అవకాశం అనుకోకుండా వచ్చింది. దాంతో ఆమె నెల ఆదాయం లక్ష దాటింది. కానీ ఏనాడూ ఆమె విశ్రమించలేదు. కొన్నిరోజులైతే ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు స్వయంగా పని చేసేది. ఎంత అలసటయినా భరించేది. ఆదాయం వారానికి రూ.లక్ష దాటింది. అప్పుడు సంగీత రెస్టారెంట్ గ్రూప్‌తో మాట్లాడి తను ఒక శాఖను ప్రారంభించింది. అప్పటికే పెద్దవాడయిన ఆమె కొడుకు సొంతంగా రెస్టారెంట్ ప్రారంభిద్దాం అన్నాడు. కానీ కొంతకాలం ఆగుదాం అనుకుంది.

మరో కుదుపు

కష్టాలకోర్చి జీవితాన్ని మలచుకుంటే మరో ఘోరం ఆమె జీవితాన్ని కుదిపేసింది. కూతురికి పెళ్లి చేసిన నెలరోజులకే అల్లుడు, కూతురు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్యాట్రీషియాకు ఏడాది పట్టింది. ఆ తర్వాత కూతురి పేరు మీద ‘సందీప రెస్టారెంట్’ ప్రారంభించారు. ఆ తర్వాత వాటికి శాఖలు పుట్టుకొచ్చాయి.

ఇప్పుడు తమిళనాడు ఫుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒక బ్రాండ్! ఆ బ్రాండ్ డెరైక్టర్ ప్యాట్రీషియా ఆదాయం రోజుకు రూ.2 లక్షలు! ఇటీవలే ఆమె ‘ఫిక్కీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2010’ అవార్డును అందుకున్నారు.

కూతురి జ్ఞాపకంగా...

రోడ్డు ప్రమాదంలో మరణించిన రోజు అంబులెన్సును పిలిస్తే శవాల్ని తీసుకెళ్లం అన్నారు. ఏ వాహనాన్ని అడిగినా తిరస్కారం ఎదురైంది. చివరకు ఓ కారు డిక్కీలో విగతజీవి అయిన కూతురి శవాన్ని పడేస్తే ప్యాట్రీషియా ఆవేదనతో కుప్పకూలిపోయింది. అందుకే అలాంటి దుస్థితి ఏ తల్లికీ రాకూడదని ఆ రూట్లో తిరగడానికి ప్రత్యేకంగా ఒక అంబులెన్సును ఏర్పాటు చేశారామె.

ఎవరు మరణించినా అందులోనే తీసుకెళ్తారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని లగేజీలాగా డిక్కిలో వేయడం భరించలేకే ఈ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించినట్లు ఆమె కన్నీటితో చెప్తారు. 

No comments:

Post a Comment